కాటారం, ( మేడిగడ్డ టీవీ న్యూస్ ) : కాటారం సర్కిల్ పరిధిలో న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి కోర్టు విచారణలకు హాజరుకాని నిందితులపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ఒకేరోజు మొత్తం 10 నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసినట్లు కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమేష్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో 8, అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చొప్పున మొత్తం 10 నాన్ బెయిలబుల్ వారెంట్లను పోలీసులు అమలు చేశారు. సంబంధిత కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను గుర్తించి వారెంట్లను అమలు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
తమపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం గౌరవ న్యాయస్థానం పలుమార్లు అవకాశాలు కల్పించినప్పటికీ, కొంతమంది నిందితులు నిరంతరం కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఈ సందర్భంగా కాటారం సర్కిల్ పరిధిలోని కాటారం, కొయ్యూరు, అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు సీఐ భీమేష్ కీలక సూచనలు చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎవరిపైనైనా కేసులు నమోదై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు ప్రతి వాయిదాకు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని సూచించారు.
న్యాయస్థానం నుంచి పలుమార్లు నోటీసులు, అవకాశాలు వచ్చినప్పటికీ కోర్టుకు హాజరుకాకుండా నిర్లక్ష్యం చేస్తే, అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ కేసుల్లో న్యాయస్థానం జారీ చేసిన వారెంట్లను అమలు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, అనంతరం న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు జైలుకు తరలించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, కేసుల విచారణకు సహకరిస్తూ నిర్ణీత వాయిదాలకు తప్పనిసరిగా హాజరుకావాలని కాటారం సీఐ భీమేష్ సూచించారు.

Post A Comment: