మహాముత్తారం మండలంలోని యమనపల్లి చెరువు కట్ట ప్రాంతంలో గురువారం అడవి ముత్తారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఇద్దరు యువకులు పోలీసులను గమనించి కంగారుపడి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పోలీసుల వద్ద అందుబాటులో ఉన్న గంజాయి పరీక్ష కిట్లతో ఇద్దరు యువకులకు పరీక్షలు నిర్వహించగా, వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి భూపాలపల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఇద్దరు యువకులను డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు.
గంజాయి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు
ఈ సందర్భంగా అడవి ముత్తారం సబ్ ఇన్స్పెక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. గంజాయి సేవించినా, విక్రయించినా, అక్రమ రవాణాకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో గంజాయి వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిఘా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ ప్రజలను కోరారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువు, ఉద్యోగం, లక్ష్యాలపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాన్ని, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల వలయం, రోజువారీ అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అడవి ముత్తారం ఎస్ఐ జి. రమేష్ కోరారు.

Post A Comment: