మహాదేవపూర్, ( మేడిగడ్డ టీవీ న్యూస్ ) : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో చేపట్టిన సుమారు 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర విజయవంతంగా ముగిసింది. పది మందితో కలిసి సుదీర్ఘ సైకిల్ యాత్ర చేపట్టిన యాత్రికుడు తన ప్రయాణంలో రైతులు, మత్స్యకారులు, ప్రజలు, సబ్బండ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. యాత్ర అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోవడంతో సాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని, రైతులు, మత్స్యకారులు, గోదావరి తీర ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రాజకీయ కక్షతోనే కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వినియోగంలోకి తీసుకురావడం లేదని యాత్రికుడు ఆరోపించారు. ప్రాజెక్టు ద్వారా నీటిని అందుబాటులోకి తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ప్రజలు కోరుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సైకిల్ యాత్ర ద్వారా గోదావరి పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు, రైతుల సాగునీటి కష్టాలు, మత్స్యకారుల జీవనోపాధి ఇబ్బందులను మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మహాదేవపూర్ మండలం ఎల్కేశ్వరం గ్రామానికి చేరుకున్న యాత్రికుడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాళ్లబండి రవీందర్ ఘనంగా సన్మానించారు. సైకిల్ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజు, కట్కు ప్రవీణ్, వేణు, కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: