జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా గుడుంబా తయారీ, నిల్వ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై అడవిముత్తారం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గుడుంబా కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని గుర్తించి మహాముత్తారం మండల తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం (13-11-2026) రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా రాజు నాయక్ అలియాస్ రాజు కుమార్, అజ్మీరా సునీత, ధర్మసోతు అనిల్, ధర్మసోతు లక్ష్మి, జర్పుల కుమార్, జర్పుల తారాబాయిలపై ఈ బైండోవర్ చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో వారు తిరిగి ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు.
ఈ సందర్భంగా అడవిముత్తారం పోలీసులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అక్రమంగా గుడుంబా తయారు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి నిషేధిత మత్తు పదార్థాల తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా వంటి నిషేధిత మత్తు పదార్థాల తయారీ, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Post A Comment: