భూపాలపల్లి, ( మేడిగడ్డ టీవీ న్యూస్ ) : జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ రోడ్డుపై ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు ఫుట్‌పాత్ దుకాణాలు పూర్తిగా దగ్ధమై సుమారు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లిన నేపథ్యంలో బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు.

గురువారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన బాధిత దుకాణ యజమానులను పరామర్శించి, జరిగిన నష్టాన్ని, వారి కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే భూపాలపల్లి తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడి విపత్తు సహాయ నిబంధనల ప్రకారం అర్హులైన బాధితులకు పరిహారం అందించాలని కోరారు. అయితే నిధుల కొరత కారణంగా ప్రస్తుతం సహాయం అందించలేని పరిస్థితి ఉందని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.

ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ప్రభుత్వానికి నిధులు లేకపోవడం విచారకరమని రవి పటేల్ విమర్శించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులు కేటాయించి ఐదు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

గతంలో రోడ్డు విస్తరణ కారణంగా దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం, దుకాణాల నిర్మాణానికి సహాయం చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. అటవీ శాఖ పరిధిలోని స్థల సమస్యను కలెక్టర్, అటవీ అధికారులు సమన్వయంతో పరిష్కరించి బాధితులకు దుకాణాలు నిర్మించుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయమై డీఎఫ్ఓతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

పేద వ్యాపారులకు న్యాయం జరిగే వరకు టీఆర్పీ పార్టీ అండగా ఉంటుందని, అధికారులు స్పందించకపోతే బాధితులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, అధికార ప్రతినిధి మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, చంద్రశేఖర్, లక్ష్మణ్, ప్రసాద్, రామ్ చరణ్, బాధిత దుకాణ యజమానులు, స్థానికులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: