మేడిపల్లి, ( మేడిగడ్డ టీవీ న్యూస్ ) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తమ ప్రతిభతో జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆకాంక్షించారు.

ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి ఆటలు, క్రీడా పోటీలు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లిలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల్లో ఐటీడీఏ డివిజన్ పరిధిలోని వివిధ ఆశ్రమ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.


రెండు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా పోటీల్లో మొదటి రోజు గురువారం బాలికలకు, రెండవ రోజు శుక్రవారం బాలురకు వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు వారిలో పోటీతత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం ఎస్సై శ్రీనివాస్, మేడిపల్లి సర్పంచ్ గడవేని పవిత్ర క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల, సహనం, జట్టుగా పనిచేసే తత్వం అలవడతాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం క్రీడల ద్వారా పెంపొందుతుందని వివరించారు.

ప్రతి విద్యార్థి చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రత్యేక ఆసక్తి కనబరచాలని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోటీల్లో గెలుపు ఒక్కటే లక్ష్యంగా కాకుండా క్రీడా స్ఫూర్తితో పాల్గొని తమలోని ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏటీడీఓ శివకృష్ణ, మేడిపల్లి ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి, కాళేశ్వరం పీజీహెచ్ఎం బాలకృష్ణ, మద్దిమడుగు/మాదారం పీజీహెచ్ఎం స్వరూప, భూపాలపల్లి ఎస్ఓ వజ్జ నారాయణ, మేడిపల్లి పీడీ బానోత్ వీరన్న, జూనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ పోరిక, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ సంక్షేమ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటుండటంతో మేడిపల్లి ఆశ్రమ పాఠశాల ప్రాంగణం క్రీడా సందడితో కళకళలాడుతోంది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: