జయశంకర్ భూపాలపల్లి: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ పోటీలో భాగంగా ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. భూపాలపల్లి అంబేద్కర్ కూడలి వేదికగా ఇరు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణం కావడం తగదన్నారు. ప్రజల మధ్య అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులారా.. భూపాలపల్లిలో మీ రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్‌ప్లాన్ వంటి హామీలను నెరవేర్చాలని కోరారు.బీఆర్ఎస్ గత పాలనపై సమాధానం చెప్పాలి.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యల పేరుతో రోడ్లపైకి రావడం విడ్డూరంగా ఉందని రవి పటేల్ విమర్శించారు. గత పాలనలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పెన్షన్ల విషయంలో పేదలు ఎదుర్కొన్న సమస్యలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఎన్నికల సమయంలో రాజకీయ పావులుగా ఉపయోగించుకోవడం రెండు పార్టీలు మానుకోవాలని సూచించారు. బహుజనులు తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి కోసం ఐక్యంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ అధికార సాధన కోసం పోరాడుతుందని రవి పటేల్ స్పష్టం చేశారు. భూపాలపల్లి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలను చట్టపరంగా నియంత్రించి ప్రజలకు రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, సురేందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: