మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహాముత్తారం మండల అధ్యక్షుడు రామగిరి రాజు అన్నారు. ఈ సమస్యపై ప్రజావాణి ద్వారా సంబంధిత అధికారులకు వినతి అందజేశారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజలు, చిన్నారులు నిత్యం సంచరించే ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను కొనసాగించడం సమంజసం కాదన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎలాంటి ఆలస్యం చేయకుండా తొలగించి, సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని రామగిరి రాజు, గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు లింగమళ్ల సడవలి రావు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా, ముందుగానే అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.
Post A Comment: