కాటారం: బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నిన్న కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద చేసిన వ్యాఖ్యలను ఐదు మండలాల కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం కాటారం సబ్‌డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెప్పల దేవేందర్‌రెడ్డి మాట్లాడారు. పుట్ట మధు ఐదేళ్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లు పెద్దపల్లి చైర్మన్‌గా పనిచేసి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పుట్ట మధు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. శ్రీధర్‌బాబు కుటుంబం చేసిన మేలును మరిచి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఒకసారి అధికారం ఇస్తే అవినీతికి పాల్పడ్డారని, ఇల్లు లేని స్థాయి నుంచి రాజగృహాలు, వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వందల కోట్ల అవినీతికి పాల్పడింది పుట్ట మధు కాదా అని ప్రశ్నించారు. ఆయన తల్లి పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల బ్లాక్‌మనీని నిర్వహించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుంటే, అభివృద్ధి జరగలేదని పుట్ట మధు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేస్తున్న అభివృద్ధిని కళ్లుతెరిచి చూడాలని సూచించారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఏమిటో, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయని అభివృద్ధి ఏమిటో పుట్ట మధు చెప్పాలని, అంబేద్కర్‌ చౌక్‌ వద్ద బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ నాయకులు సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రైతు భరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయని రేషన్‌ కార్డుల పంపిణీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ధైర్యం తమకు ఉందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. జాడి కవిరాజు, మంథని మధుకర్‌, రేవెల్లి రాజబాబు, గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసుల్లో పుట్ట మధు ప్రమేయంపై ప్రశ్నలు సంధించారు. ఈ కేసులపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్ల అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే పాలించడం చేతకాకపోయిన పుట్ట మధుకు శ్రీధర్‌బాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నాలుగున్నరేళ్లు అసెంబ్లీలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడని పుట్ట మధు ఇప్పుడు ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. తెలంగాణలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఏకైక ప్రజాప్రతినిధి పుట్ట మధు కాదా అని ప్రశ్నించారు. హత్యల్లో తన బంధువులు, ముఖ్య అనుచరులు పాల్గొన్నారనే ఆరోపణలపై నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న మంథని నియోజకవర్గంలో హత్యా సంస్కృతిని తీసుకొచ్చిన పుట్ట మధు, మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో ఐదు మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులతో పాటు రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్‌ సభ్యుడు దండు రమేష్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంగోతు సుగుణ, జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్నారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పంతకాని తిరుమల, జిల్లా కిసాన్‌ అధ్యక్షుడు వంశవర్ధన్‌రావు, మంథని నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు చీమల సందీప్‌, మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, కాటారం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చిట్టూరి మహేష్‌గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం నాయకుడు కిషన్‌ నాయక్‌, గుడాల శ్రీను, కాటారం మండల సీనియర్‌ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: