ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యావంతులు రాజకీయంగా చైతన్యవంతులై తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకున్నప్పుడే తమ సామాజిక వర్గాల హక్కులు, సమస్యలు, ఆకాంక్షలను రాజకీయ వ్యవస్థ దృష్టికి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నవారిలో మళ్లీ నమోదు చేసుకోవాలా? అనే సందేహం ఉందని తెలిపారు. అందువల్ల అర్హులైన గ్రాడ్యుయేట్లు ప్రస్తుత ఎన్నికల అధికారుల మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైన సందర్భాల్లో నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులు సంబంధిత ధ్రువపత్రాలతో ఓటరు నమోదుకు ముందుకు రావాలని కోరారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని, ఓటరు నమోదు చేసుకోవాలనుకునే గ్రాడ్యుయేట్లు తమ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, మార్కుల మెమో తదితర అవసరమైన పత్రాలతో పార్టీ నాయకులను సంప్రదించాలని తెలిపారు. అర్హులైన వారికి నమోదు ప్రక్రియలో అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించారు. ఓటరు నమోదుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తుల్లో అర్హులైన గ్రాడ్యుయేట్లకు కూడా సమాచారం అందించి నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఓట్లు మనవి.. అధికారం మాత్రం అగ్రకులాలకేనా? అని ప్రశ్నించిన రవి పటేల్, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభాలో గణనీయమైన వాటా కలిగిన బీసీలకు రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల ఓట్లతో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నప్పటికీ, కీలక రాజకీయ పదవులు, అభ్యర్థిత్వాల విషయంలో బీసీలకు తగిన అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమని విమర్శించారు.
బీసీల రాజకీయ ఎదుగుదలకు ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకుని ఐక్యంగా నిలబడాలని కోరారు. తమ సామాజిక వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం సాధించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే తమ బలాన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయగలమని పేర్కొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీ రాజ్యాధికార సాధన కోసం పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని రవి పటేల్ తెలిపారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్పీ తరఫున బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పార్టీ శ్రేణులు, బీసీ సంఘాలు, విద్యావంతులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం లభించాలంటే ఓటరు నమోదు నుంచి ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడం వరకు ప్రతి దశలో చైతన్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 6 గడువును దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి నియోజకవర్గంలోని అర్హులైన గ్రాడ్యుయేట్లు వెంటనే ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఒక్క గ్రాడ్యుయేట్ కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని, బీసీ రాజ్యాధికార ఉద్యమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, సురేందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: