కాటారం: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ముందుగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయినులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కాటారం కేజీబీవీ ప్రిన్సిపాల్‌ చల్ల సునీత పాఠశాలలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఘనంగా సత్కరించారు. కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు ఎన్‌. శిరీష, పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని జి. నళిని, శారీరక విద్య ఉపాధ్యాయిని రాజేశ్వరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించారు. వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు తమ గురువుల గొప్పతనాన్ని వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గురువుల సేవలను కొనియాడుతూ పాటలు పాడారు. నృత్యాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయుల ప్రాధాన్యత, విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్రను వివరిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రిన్సిపాల్‌ చల్ల సునీత రచించిన ‘గురువు గారి గొప్పదనం’ పాటను ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయ బృందం కలిసి ఆలపించారు. గురువు యొక్క గొప్పతనం, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను చాటిచెప్పేలా ఈ పాట సాగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ చల్ల సునీత మాట్లాడుతూ.. గురువు దైవంతో సమానమని అన్నారు. విద్యార్థుల జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసేది గురువులేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను, సూచనలను విద్యార్థినులు శ్రద్ధగా ఆలకించాలని సూచించారు. కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులను సత్కరించడం, విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉపాధ్యాయ బృందం కలిసి పాట ఆలపించడం వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చల్ల సునీతతో పాటు విజయ, శిరీష, నళిని, కవిత, శ్రీలత, సుజాత, స్వప్న, సరిత, అరుణ, మణిమాల, రాజమణి, మౌనిక, రాజేశ్వరి, శ్రావ్య, లక్ష్మి, రిబ్కా తదితర ఉపాధ్యాయినులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.





Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: