కాటారం: అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, వెయ్యి రోజులైనా వాటిని అమలు చేయని దుద్దిళ్ల శ్రీధర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా శుక్రవారం కాటారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ కూడలి వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ హామీల అమలుపై కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గ్యారంటీ కార్డులు పట్టుకుని ఇంటింటికీ తిరిగి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాల ప్రజలను దుద్దిళ్ల శ్రీధర్‌, రేవంత్‌రెడ్డి దగా చేశారని ఆరోపించారు. హామీలు ఆకాశంలో.. అమలు పాతాళంలోకి వెళ్లాయని ఎద్దేవా చేశారు. గతంలో సిపాయి మాటలు మాట్లాడిన మంథని ఎమ్మెల్యే ఇప్పుడు హామీల అమలుపై ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. హామీలు ఇవ్వకుండానే ప్రజల కష్టాలను తీర్చేలా పథకాలను రూపొందించి అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. గతంలో రూ.200గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం రూ.వెయ్యికి, అనంతరం రూ.2 వేలకు పెంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ ఏమైందో సమాధానం చెప్పాలని కోరారు. వికలాంగుల పెన్షన్లను కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశలవారీగా పెంచిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాల పెంపు, మహిళా సంఘాలు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కాటారం మండల ప్రజలు ప్రతి ఎన్నికల్లో వేలల్లో మెజార్టీ ఇచ్చినా ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు మేలు చేసిందేమీ లేదని పుట్ట మధూకర్‌ అన్నారు. దుద్దిళ్ల కుటుంబం మంథని నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంథని పరువు తీస్తోందని విమర్శించారు. 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఒకే కుటుంబానికి ఐదుసార్లు ఓట్లు వేసి గెలిపిస్తే, మంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని దగా చేసి మంథనికి అపకీర్తి తీసుకొచ్చారని దుద్దిళ్ల శ్రీధర్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ దగాకోరు పాలనపై ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వాన్ని నిలదీయాలని పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: