జయశంకర్ భూపాలపల్లి జిల్లా: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహోన్నత యోధుడని అన్నారు. సామాన్య ప్రజలను ఏకం చేసి, అప్పటి సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపారని కొనియాడారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా పోరాటాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కుల, ఆర్థిక, సామాజిక వివక్షలకు తావులేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయడమే సర్వాయి పాపన్న గౌడ్‌కు అందించే నిజమైన నివాళి అని రవి పటేల్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, గౌరవప్రదమైన జీవితం ప్రతి పేదవాడికి అందేలా పోరాడుతామని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడితే, నేడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సామాజిక న్యాయం, సమానత్వం, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతోందని రవి పటేల్ అన్నారు. బహుజనుల హక్కుల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు.


Post A Comment: