భూపాలపల్లి, జూన్ 3: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపుల యాజమాన్యాలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎంఎల్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ బందు సుజాత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఫర్టిలైజర్ మరియు విత్తనాల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కోరారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న షాపుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని, రైతులకు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లులు ఇవ్వాలని సూచించారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా, మరోవైపు ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం రైతాంగంపై అదనపు భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఒక బస్తా ఎరువు ధర రూ.2,300కు చేరుకుందని, వెంటనే ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఆత్కూరి శ్రీకాంత్, బుర్ర స్వాతి, క్రాంతి, రవి తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: