కాటారం, జూన్ 6: కాటారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ పనులను శనివారం బీజేపీ కాటారం మండల శాఖ నాయకులు పరిశీలించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేసి దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కాటారం పట్టణంలో ప్రస్తుతం కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారం నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని తెలిపారు. గతంలో ఇదే కారణంగా ఓ మహిళ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్వంత మండలంలోనే మార్కెట్ నిర్మాణం ఆలస్యమవుతుండటం సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ కాటారం మండల శాఖ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి సునీల్, బొంతల రవీందర్, జిల్లా నాయకులు డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: