కాటారం, జూన్ 10 : కాటారం మండలం మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మేడిపల్లి–కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, పాఠశాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారిని బడిలో చేర్పించడం లక్ష్యంగా ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ విద్యా సదుపాయాలు తదితర అంశాలను వివరించారు. పిల్లల భవిష్యత్తుకు విద్యే పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ ప్రతి చిన్నారిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల నమోదు పెంపుతో పాటు విద్యా ప్రమాణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన ఉపాధ్యాయులు, ప్రతి చిన్నారి విద్యను పొందేలా తల్లిదండ్రులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Post A Comment: