కాటారం, మే 29: కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తాడిచెర్ల–కాపురం టీఎస్ జెన్‌కో భూనిర్వాసితుల కమిటీ సభ్యులు, డేంజర్ జోన్ పరిధిలోని ప్రజలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. తాడిచెర్ల జెన్‌కో డేంజర్ జోన్ పరిధిలోని నివాస గృహాల సేకరణ కోసం టీఎస్ జెన్‌కో నుంచి రూ.261 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. నిధుల మంజూరుతో డేంజర్ జోన్‌లో నివసిస్తున్న కుటుంబాలకు ఊరట లభించడంతో పాటు పునరావాస ప్రక్రియ వేగవంతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబుకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతాభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: