హనుమకొండ, మే 29 (ప్రతినిధి): రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతల్లో మాత్రం శూన్యమే కనిపిస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం పరకాల, నడికూడ మండలాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులతో కలిసి హనుమకొండలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల దుస్థితి, పార్టీ పరిస్థితులు, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిరోజూ కొత్త మాటలు చెబుతున్నారే తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచాయని, పల్లె ప్రగతి, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారాయని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు నిలిపివేసి సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ప్రజల సమస్యలపై కనీస చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులతో ముందుకెళ్తోందని, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అప్రమత్తంగా ఉండాలని, పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ మండలాల బీఆర్ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Home
hanamkonda (హనుమకొండ)
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతల్లో మాత్రం శూన్యం : మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

Post A Comment: