హనుమకొండలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కళాకారుల సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు డప్పు, కోలాటం, భజన కళాకారులతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పరస్పరం పరిచయ కార్యక్రమం నిర్వహించుకుని, అనంతరం కళాకారులు తమ సమస్యలను విపులంగా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ కళలను కొనసాగిస్తున్న కళాకారుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల సమస్యలను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ముఖ్య అతిథి రవి పటేల్ మాట్లాడుతూ కళాకారుల సమస్యలను ఎమ్మెల్సీ మల్లన్నకు వివరించి, శాసన మండలిలో చర్చకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అలాగే త్వరలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కళాకారులు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘం నాయకులకు, కళాకారులకు రవి పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.


Post A Comment: