భూపాలపల్లి: రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే వాదనలు పూర్తయిన ఈ కేసులో, తుది తీర్పును ఈ నెల 22వ తేదీన వెల్లడించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చులు, సాంకేతిక అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కమిషన్ సమర్పించిన నివేదికపై వివిధ అభ్యంతరాలు వ్యక్తమవడంతో, దాన్ని సవాలు చేస్తూ పలువురు ప్రముఖులు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ విధానం, దాని పరిధి, నివేదిక చట్టబద్ధతపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమిషన్ నియామకం రాజ్యాంగ విరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కమిషన్ నియామకం పూర్తిగా చట్టబద్ధమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని కోర్టుకు వివరించారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడం అవసరమని, అందుకే కమిషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు సమగ్రంగా విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, నిర్ణయాన్ని ప్రకటించాల్సిన రోజున మరోసారి వాయిదా వేయడం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశముండటంతో, అన్ని వర్గాల దృష్టి ఇప్పుడు 22వ తేదీపై నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన నేపథ్యంలో, హైకోర్టు తుది తీర్పు కీలక మలుపు తిప్పే అవకాశముంది. కమిషన్ నివేదిక చెల్లుబాటు అవుతుందా? లేక రద్దవుతుందా? అనే అంశంపై స్పష్టత రానుంది. తుది తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.

Post A Comment: