భూపాలపల్లి, ఏప్రిల్ 9 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భూపాలపల్లి KTPP ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆయన పాల్గొన్నారు. గత రెండు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న రవి పటేల్ అనంతరం మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆర్టిజన్లుగా విలీనం కాని కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించి, వారి విద్యార్హతలకు అనుగుణంగా కన్వర్షన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు కొనసాగుతున్న నిరసన దీక్షలకు కూడా ఆయన సంఘీభావం తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న అన్మాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, వారికి భద్రతా చర్యలు కల్పించాలని, విద్యార్హతల ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఈ కార్మికుల సేవలపై ఆధారపడి ఉందని, వారి సమస్యలను విద్యుత్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఆర్టిజన్ కార్మికులు లేకుండా విద్యుత్ శాఖ ఒక్కరోజు కూడా ముందుకు సాగలేదని స్పష్టం చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించిన రవి పటేల్, భూపాలపల్లి జిల్లాలో కార్మికులు ఎప్పుడైనా పిలుపునిచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుండి పోరాడతారని హామీ ఇచ్చారు. కార్మికులు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు అనంతల సంపత్ (బొట్టు), ఎలక్ట్రిషియన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా నాయకులు ప్రణయ్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: