కాలేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం ఆశ్రమ పాఠశాల వార్డెన్ వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) జిల్లా కార్యదర్శి బందు సుజాత డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న ఆహారం, మెనూ అమలు, తాగునీరు, బాత్రూమ్‌లు, ఇతర మౌలిక వసతులపై పలు సమస్యలు ఉన్నాయని ఆరోపిస్తూ కలెక్టర్, డీటీడీవోకు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకు తగిన చర్యలు కనిపించలేదని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బందు సుజాత మాట్లాడుతూ.. గత కొద్ది నెలలుగా పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, విద్యార్థులకు అందాల్సిన పౌషకాహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థులకు ఏ రోజు ఏ ఆహారం అందించాలి, మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా లేదా అనే విషయాల్లో స్పష్టత లేకుండా పోయిందని అన్నారు. కొంతమంది విద్యార్థులను తమకు అనుకూలంగా మార్చుకుని, అధికారులు లేదా ఇతరులు వచ్చిన సమయంలో తమకు అనుకూలంగా మాట్లాడేలా ఒక గ్రూపును తయారు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.
మౌలిక వసతులపై కూడా ప్రశ్నలు.
పాఠశాలలోని ల్యాబ్‌ను వినియోగించకుండా పూజా గదిగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయని సుజాత పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల వార్డెన్ నిర్లక్ష్యంగా, కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలలోని వాటర్ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడంతో విద్యార్థులు మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. బాత్రూమ్‌లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
విచారణ జరిగిందా? నివేదిక ఏమైంది?
కలెక్టర్, డీటీడీవోకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు? పాఠశాలలో వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారా? మెనూ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, ఆహార పదార్థాల కొనుగోలు వివరాలు, విద్యార్థులకు అందించిన భోజనాన్ని పరిశీలించారా? మౌలిక వసతులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నివేదిక రూపొందించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఫిర్యాదులు వచ్చినప్పుడు కేవలం విచారణ పేరుతో సరిపెట్టకుండా, వాస్తవ పరిస్థితులను స్వతంత్రంగా పరిశీలించి బాధ్యత ఎవరిదో తేల్చాల్సిన అవసరం ఉందని ఏఐఎస్‌ఏ పేర్కొంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఆధారాలతో విషయాలను బయటపెడతాం.
అధికారుల విచారణ నిష్పక్షపాతంగా జరగకపోతే తామే అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి సంబంధిత అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని బందు సుజాత హెచ్చరించారు. వార్డెన్‌ను కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే తమ ఆరోపణలపై కూడా ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణలో అధికారుల పాత్రలోనూ తప్పిదాలు బయటపడితే సంబంధిత ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్ఫూర్తి, కిరణ్ మై, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: