గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి భూసేకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలో ఓఎస్‌డీగా విధులు నిర్వహిస్తున్న మనోహర్‌తో కలిసి కలెక్టర్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులపై అధికారులకు అవగాహన కల్పించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, సింగరేణి, జెన్‌కో, జాతీయ రహదారులు తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ జరుగుతోందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన రైతులకు చట్టప్రకారం పరిహారం, పునరావాసం, ఇతర పునరావాస ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భూసేకరణకు సంబంధించి రైతులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఓఎస్‌డీ మనోహర్ సూచించారు.
భూసేకరణ చట్టాలకు అనుగుణంగా ప్రతి దశను పక్కాగా నమోదు చేయాలని, సమావేశాల మినిట్స్‌ను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు అవసరమైన చోట్ల వీడియో రికార్డింగ్ చేపట్టాలని తెలిపారు. భూములు ఇచ్చే రైతులను కేవలం భూమి ఇచ్చేవారిగా కాకుండా అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా గౌరవించాలని సూచించారు. అధికారుల వైఖరి కారణంగా రైతుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించి తలెత్తే వివాదాలను నిబంధనల ప్రకారం విచారించి పరిష్కరించాలని, ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న వారి అర్హతలను తహసీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూసేకరణలో భూమి విస్తీర్ణం, రికార్డుల వివరాలు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మనోహర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఏఓ శ్రీనివాసులు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: