జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పరిధిలోని బయ్యారం గ్రామపంచాయతీ ప్రాంతంలో ప్రతిపాదిత చిన్న కాళేశ్వరం కాలువ నిర్మాణానికి సంబంధించి అధికారులు చేపట్టిన సర్వే కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నిర్వహించేందుకు గ్రామానికి వచ్చిన అధికారులను స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూములే కుటుంబాల జీవనాధారమని పేర్కొన్నారు. ఆ భూముల మీదుగా కాలువ నిర్మాణం చేపడితే సాగు పూర్తిగా దెబ్బతింటుందని, తమ జీవనోపాధి సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేస్తున్న సారవంతమైన భూములను కోల్పోతే తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కాలువ నిర్మాణానికి ముందు రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా సర్వేలు నిర్వహించడం సరికాదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. భూముల స్వాధీనం, పరిహారం చెల్లింపు, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలకు తగిన పరిష్కారం చూపే వరకు సర్వే పనులు కొనసాగించనివ్వమని హెచ్చరించారు. రైతుల నిరసనతో సర్వే పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సమస్యపై ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Home
Telangana( తెలంగాణ )
చిన్న కాళేశ్వరం కాలువ సర్వేకు బయ్యారం రైతుల అడ్డంకి – ఉద్రిక్తత మధ్య నిలిచిన పనులు

Post A Comment: