కాటారం, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కాటారం మండలంలోని చీడెనేపల్లి, రెగులగూడెం రెవెన్యూ గ్రామాల్లో బుధవారం అవగాహన గ్రామసభలు నిర్వహించారు. చీడెనేపల్లి గ్రామపంచాయతీలో చీడెనేపల్లి రెవెన్యూ గ్రామానికి, రెగులగూడెం గ్రామపంచాయతీలో రెగులగూడెం రెవెన్యూ గ్రామానికి సంబంధించిన గ్రామసభల్లో భూ రీ-సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహణ, భూ రికార్డుల ఖచ్చితత్వం, రైతులు సమర్పించాల్సిన పత్రాలు, భూ వివాదాల పరిష్కారంలో రీ-సర్వే ప్రాధాన్యతపై అధికారుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాటారం తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. భూములకు శాశ్వత హద్దులు ఖరారు చేయడంతో పాటు భూ రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిచేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రతి రైతు సర్వే సమయంలో తప్పనిసరిగా హాజరై అవసరమైన పత్రాలతో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డివిజన్ డిప్యూటీ ఐఓఎస్, సంబంధిత సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), గ్రామ పంచాయతీ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, చీడెనేపల్లి, రెగులగూడెం గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామసభలో రైతులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చి, రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.



Post A Comment: