భూపాలపల్లి, ఫిబ్రవరి 23: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం పట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధిత కుటుంబానికి సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, బీసీలపై వరుసగా జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతోందని ప్రశ్నించారు. బలహీన వర్గాల ప్రాణాలకు భద్రత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. రెండు నెలల శిశువు మృతి దారుణమని, నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతుండటం చట్టవ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. కుల అహంకారంతో జరిగే హత్యలు ఆగకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్టే ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, వెంటనే “బీసీ అట్రాసిటీ చట్టం” తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీలపై దాడిని సమాజంపై దాడిగా పరిగణించి కఠిన శిక్షలు విధించేలా చట్టం చేయాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిలకర శ్రీను, మామిడి శ్రీకాంత్, కౌటం సురేందర్, మోటపోతుల సమ్మయ్య, గంధం సిద్దు, దుస్స శ్రీకాంత్, ప్రభాత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: