ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పార్లమెంట్ ఎన్నికల విధులతో పాటు, పోలింగ్ రోజున అత్యవసర సేవలు అందించే అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.
శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్,ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పన పై జిల్లా ఎన్నికల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. వీరి కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వద్ద తప్పనిసరిగా ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు
పోలింగ్ రోజున జిల్లాలో ఎన్నికలు విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది పేరు, ఎంప్లాయి కోడ్, హోదా, మొబైల్ నెంబర్, ఓటరు వివరాలు, అసెంబ్లీ సెగ్మెంట్ వివరాలు ఓటరు జాబితాలో పార్ట్ &సీరియల్ నెంబర్, ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ మొదలగు వివరాలు రూపొందించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది రాండనైజేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సదరు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందించేందుకు అవసరమైన అదనపు ఫారం 12 లు సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహించే సమయంలో అవసరమైన మేర కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఫారం 12 లు అందజేసి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సమర్పించిన ఆప్షన్ లో ప్రకారం ఏ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అనే అంశం ఎస్.ఎం.ఎస్ ద్వారా పంపడం జరుగుతుందని, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తారని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసిందని తెలిపారు.
ప్రతి జిల్లాలో ఉద్యోగుల నుంచి ఫారం 12 తీసుకొని ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని కేటాయించాలని, ఆన్ లైన్ లో నమోదు చేసిన ఫారం 12 లు సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్తాయని అన్నారు. ఏప్రిల్ 29 నాటికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు సమర్పించాల్సి ఉంటుందని, ఫారం 7ఏ ను సీ.ఈ.ఓ కార్యాలయం ధ్రువీకరించిన తర్వాత ఏప్రిల్ 30 నుంచి మే 1, 2024 వరకు రిటర్న్ అధికారి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ లను ప్రింట్ చేయాలన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో మే 3న, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మే 4 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్వీకరించాలని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ఫారం 12 సమర్పించి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పొందవచ్చని తెలిపారు.
భారత ఎన్నికల కమిషన్ అత్యవసర సేవలలో పాల్గొనే సిబ్బందికి సైతం ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని, కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన రవాణా సేవలు ,మీడియా, విద్యుత్, బిఎస్ఎన్ఎల్ పోస్టల్ టెలిగ్రామ్ ఆర్టీసీ అగ్నిమాపక సేవలు ట్రాఫిక్ పోలీస్, మొదలగు అత్యవసర శాఖల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు.
అత్యవసర సేవలలో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిటర్నింగ్ అధికారికి ఏప్రిల్ 23 లోపు ఫారం 12డి సమర్పించాలని, సదరు దరఖాస్తులను పరిశీలించి రిటర్నింగ్ అధికారి ఏప్రిల్ 24 నాడు ఆమోదించిన దరఖాస్తులకు ఎస్ఎంఎస్ ద్వారా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రం పై సమాచారం అందిస్తారని, మే 3 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద వారి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు.
85 సంవత్సరాల పైబడి పూర్తిగా నడవ లేని సీనియర్ సిటిజెన్లకు,నడవ లేని దివ్యాంగులకు, కోవిడ్ పేషెంట్లుకు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించు కోవాలనుకునేవారు ఏప్రిల్ 23 లోపు ఫారం 12 డి సమర్పించాలని అన్నారు. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అర్హులను ఏప్రిల్ 25 నాటికి ఎంపిక చేస్తారని, ఏ.ఆర్.ఓ లు షెడ్యూల్ రూపొందించి బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటి వచ్చే షెడ్యూల్ సమాచారం ఓటర్లకు అందించడం జరుగుతుందని అన్నారు.
మే 3 నుంచి మే 6 వరకు మొదటి దశ , మే 8న రెండవ దశ ఇంటి వద్ద పోలింగ్ పూర్తి చేయడం జరుగుతుందని, ఇంటి వద్ద పోలింగ్కు వెళ్లే సమయంలో పోలింగ్ సిబ్బంది వీడియో గ్రాఫర్ తప్పనిసరిగా వెళ్తారని, రాజకీయ పార్టీలకు సైతం సమాచారం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వై.వి. గణేష్ , పరకాల ఆర్డిఓ నారాయణ, తహసిల్దార్లు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.