ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వాహనాల రిజిస్ట్రేషన్లకు టీఎస్ కు బదులుగా టీజీ అనే పదాన్ని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2 ఆవిర్భావ తేదీన కేంద్ర ప్రభుత్వం వాహనాలకు టీజీ అని గెజిట్ ఇచ్చిందని అన్నారు. ఐఏఎస్ అధికారుల ఐడి కార్డులు గాని , ఇతరత్రా కేంద్రం గుర్తించిన ప్రతి అంశానికి సంబంధించి టీజీ అని ఉంటుందన్నారు. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమోకానీ ప్రభుత్వం ఆనాడు 17 రోజుల తదుపరి తిరిగి ప్రభుత్వం నుంచి మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి టీఎస్ గా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ తీర్మానం మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్యాబినెట్, శాసనసభ తీర్మానాలను అందజేసినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా కేంద్రం నుండి అనుమతులు వచ్చాయన్నారు. టీఎస్ కు బదులుగా టీజీగా అనుమతిస్తూ గెజిట్ను ఈరోజు జారీ చేసిందన్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుండి, శుక్రవారం నుండి రిజర్వేషన్ అయ్యే ప్రతి వాహనానికి టీజీ పేరుమీద అవుతాయన్నారు. ఇదొక మార్పు అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు జవాబు ఇది అని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని, ఇది పార్టీ నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయం వ్యక్తిగతంగా తీసుకున్నది కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన టీజీ అనే పదం ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ గా మార్చబడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవం మేరకు టీజీ అనే పదాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. రవాణా శాఖ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతికంగా చారిత్రకంగా తెలంగాణ సామాజిక భావనలను గౌరవించాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యక్రమాలను చేస్తుందన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా , వెంకట్ రెడ్డి, డిటిసి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: