ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఇతివృత్తం తీసుకుందన్నారు. పెరుగుతున్న
ఆహార కల్తీని నిరోధించాల్సిన అవసరముందన్నారు. ఆహార కల్తీ నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార కల్తీ, వినియోగదారుల సమస్యలపై దృష్టి సారించాలని వినియోగదారుల హక్కుల సంఘాల ప్రతినిధులకు సూచించారు. ప్రతి వస్తువు ఆన్లైన్లో లభిస్తున్నాయని, ఈ క్రమంలో ఆన్లైన్లో కూడా నాణ్యత లేని వస్తువులు, మోసాలు జరుగుతున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుంటే ప్రజలకు మెరుగైన సేవలను అందించవచ్చన్నారు. ప్రజల హక్కులకు భంగం కలగకుండా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వినియోగదారుల సంఘాల సహకారం తీసుకుంటామన్నారు. కన్స్యూమర్ ఫోరమ్స్ వినియోగదారులకు అందిస్తున్న సేవల పట్ల అభినందనలు తెలియజేశారు.వినియోగదారుల ఫిర్యాదుల కోసం సెల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్, ఏఎస్వో నరసింహారావు, డిటీలు రోజా రాణి, కృష్ణ, రమేష్, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, జీడబ్ల్యూఎంసీ కాజిపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, వినియోగదారుల ఫోరం ప్రతినిధులు రతన్ సింగ్ ఠాకూర్, ఓరుగల్లు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రతినిధులు తేరాల యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: