ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ :
ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేయాలని , వాటి ఆధ్వర్యంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో శనివారం అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనపై సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని, కమిటీకి మహిళా సంఘం నాయకురాలు అధ్యక్షురాలిగా, ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్వీనర్ గా ఉంటారని పేర్కొన్నారు. రెండేళ్ల పాటు కొనసాగే కమిటీలో విద్యార్థుల తల్లులను సభ్యులుగా ఎంపిక చేయాలన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ పేరిట బ్యాంకులో ఖాతా తెరవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు ఏమేం కావాలో నివేదికను రూపొందించి వాటిని సమకూర్చుకోవాలన్నారు. తరగతి గదిలో ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు అమర్చాలన్నారు. వేసవి సెలవుల తరువాత విద్యార్థులు మళ్ళీ స్కూలుకు వచ్చేసరికి పాఠశాలల్లో మార్పు రావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు, స్థానిక టైలర్ లకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యార్థుల యూనిఫామ్ కుట్టే సామర్థ్యం కలిగిన మహిళా సంఘాలను గుర్తించి ఆర్డర్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యంతో పాటు తరగతి గదుల మరమ్మతులు, టాయిలెట్స్ను వినియోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ వసతుల కల్పన బాధ్యతలను పాఠశాలల పున ప్రారంభం అయ్యే నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పూర్తిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, డీఈఓ డాక్టర్ అబ్దుల్ హై, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: