వచ్చే యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు. వరి సాగును తగ్గించి, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలిపారు. ముఖ్యంగా కూరగాయల సాగుపై దృష్టి సారించాలని, భూమి సారాన్ని పెంపొందించేందుకు పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ పంటను సాగు చేయడం ప్రయోజనకరమని వివరించారు.
వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధించిన పలువురు రైతులు తమ అనుభవాలను ఈ సందర్భంగా ఇతర రైతులతో పంచుకున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా కలిగే ప్రయోజనాలు, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయ ఖర్చులను తగ్గించుకునే పద్ధతులపై చర్చించారు.
అదేవిధంగా పంటలను వివిధ రకాల తెగుళ్ల నుంచి రక్షించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మందును రైతులకు యాభై శాతం రాయితీపై పంపిణీ చేశారు. పంటల ఆరోగ్య పరిరక్షణలో ఈ మందు వినియోగం, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేయడం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే మార్గాలను తెలియజేయడం ఈ శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
కాటారం మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ పర్యవేక్షణలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు, కాటారం మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, మండలంలోని పలువురు రైతులు పాల్గొన్నారు.

Post A Comment: