భూపాలపల్లి, అక్టోబర్ 26 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ‘మీ ప్రమాణం’ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల హాజరు నమోదును ఈ యాప్‌ ద్వారా పర్యవేక్షించనున్న నేపథ్యంలో, అన్ని శాఖల అధికారులు ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం, ‘మీ ప్రమాణం’ యాప్‌లో ఉద్యోగుల వివరాల నమోదు అంశంపై జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాప్‌లో ఇప్పటివరకు నమోదైన వివరాలు, మిగిలిన శాఖల్లో నమోదు ప్రక్రియ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు కేవలం 19 శాఖలకు చెందిన అధికారులు మాత్రమే ‘మీ ప్రమాణం’ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రతి అధికారి, ఉద్యోగి ఈ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా, ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని సిబ్బందికి తగిన సూచనలు అందించి, ప్రతి ఉద్యోగి వివరాలు యాప్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల హాజరు నమోదును ‘మీ ప్రమాణం’ యాప్‌ ద్వారా పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియను అన్ని శాఖలు బాధ్యతగా తీసుకోవాలని, నిర్దేశిత ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలనా ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నమోదు ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ‘మీ ప్రమాణం’ యాప్‌లో వివరాల నమోదు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైనా, సందేహాలు ఉన్నా లేదా ఏవైనా సలహాలు, సూచనలు తెలియజేయాలన్నా జిల్లా నోడల్ అధికారి, ఈడీఎం శ్రీకాంత్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని తమ శాఖల సిబ్బందికి తెలియజేసి, నమోదు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి, ఈడీఎం శ్రీకాంత్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: