భూపాలపల్లి జిల్లా, అక్టోబర్ 26 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి వినతులు సమర్పిస్తున్నారని, వారి అర్జీల పట్ల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 70 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి అర్జీని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, అర్జీలపై వారంలోగా పరిష్కార చర్యలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలపై తీసుకున్న చర్యలు, పరిష్కార వివరాలను ప్రజావాణి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినా, అనవసరంగా జాప్యం చేసినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వసంతకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: