కాటారం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 16 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, వినతులను అధికారులు స్వీకరించి వాటి వివరాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సమస్యపై ఒక దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ఆయా శాఖల అధికారులకు పంపిస్తామని ఎంపీడీవో అడ్డూరి బాబు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల పరిధిలో పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అడ్డూరి బాబుతో పాటు మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: