మహాముత్తారం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజూ సుమారు 150 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తున్నారని కుల ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ తెలిపారు. ప్రస్తుతం ఒక్క వైద్యురాలు మాత్రమే సేవలందిస్తుండటంతో రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో రోగులను ఒక్క వైద్యురాలు పరీక్షించాల్సి రావడంతో వైద్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. గ్రామీణ ప్రజలకు పీహెచ్‌సీ ప్రధాన ఆధారం కావడంతో ప్రభుత్వం తక్షణమే మరో వైద్యుడిని నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రోగుల సంఖ్యకు అనుగుణంగా నర్సింగ్, ఇతర వైద్య సిబ్బందిని కూడా పెంచాలని కోరారు. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలని పీక కిరణ్ కోరారు. ఈ సమావేశంలో జేఏసీ జిల్లా కోకన్వీనర్ రామగిరి రాజు, మండల కన్వీనర్ లింగమళ్ల సడవలిరావు పాల్గొన్నారు.

Post A Comment: