కాటారం, సెప్టెంబర్ 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చల్ల సునీత కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భాష, యాస, మాండలికాల గొప్పతనాన్ని చాటేలా విద్యార్థినులు పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు, కవితలు, గేయాలతో ఆకట్టుకున్నారు. ప్రిన్సిపాల్ చల్ల సునీత రచించిన ‘తెలంగాణ మాండలికపు భాషావాది’ పాటను ఇంటర్మీడియట్ విద్యార్థిని బి.వర్షిణి ఆలపించారు. ఆమె రచించిన పద్యాలను ఆరో తరగతి విద్యార్థినులు ఆలపించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కవిత ఆటవెలది పద్యాన్ని రచించి ఆలపించారు. తెలంగాణ మాండలిక పదాలను ఉపయోగిస్తూ ప్రిన్సిపాల్ చల్ల సునీత, తెలుగు ఉపాధ్యాయురాలు కవిత సంభాషణ రూపంలో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు ఉపాధ్యాయురాలు సరిత తెలుగు భాషపై గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చల్ల సునీత మాట్లాడుతూ.. మాతృభాష, తెలంగాణ యాస, మాండలికాల పరిరక్షణకు కాళోజీ నారాయణరావు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సామాన్యుడే తన దేవుడని ప్రకటించిన కాళోజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు కవిత, సరిత, శిరీష, నళిని, సుజాత, అరుణ, మణిమాల, రాజమణి, స్వప్న, శ్రీలత, మౌనిక, రాజేశ్వరి, శ్రావ్యలక్ష్మి, రిబ్కా తదితరులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Post A Comment: