కాటారం, సెప్టెంబర్ 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ భాష, యాస, మాండలికం, సంస్కృతి పరిరక్షణకు కాళోజీ నారాయణరావు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి సమస్యలు, ఆకాంక్షలను తన రచనలు, ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప ప్రజాకవిగా కాళోజీ నిలిచిపోయారని పేర్కొన్నారు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలిచిన కాళోజీ స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆయన భాషా సేవలకు దక్కిన గౌరవానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని కాళోజీకి నివాళులర్పించారు.

Post A Comment: