కాటారం: పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంరక్షణపై విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వృక్ష సంరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలోని తల్లి వృక్షాన్ని గుర్తించి విద్యార్థినీలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు తల్లి వృక్షానికి పూజ చేసి, అనంతరం వృక్షాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. వృక్షాలు మానవాళికి అందించే ప్రాణవాయువు, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్రను గుర్తుచేస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి, పెంచి పెద్దవిగా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో వివరించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలందరూ మొక్కలను పెంచుతూ, వృక్షాలను సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీతతో పాటు ఉపాధ్యాయులు విజయ, నళిని, శిరీష, సుజాత, మణిమాల, అరుణ, రాజమణి, కవిత, శ్రీలత, స్వప్న, సరిత, మౌనిక, శ్రావ్య, లక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినీలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని వృక్ష సంరక్షణపై తమ నిబద్ధతను చాటారు.

Post A Comment: