కాటారం, జూలై 16: దేశంలోకి ఎల్‌నినో ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో రానున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కాటారం మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) పూర్ణిమ సూచించారు. గురువారం కాటారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆగస్టు నాటికి ఎల్‌నినో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. బిందు, తుంపర సేద్యం వంటి నీటి పొదుపు పద్ధతులను అనుసరించడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులు నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇదే సమయంలో మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓలు) రైతులతో అవగాహన సమావేశాలు నిర్వహించారు. ప్రతాపగిరిలో శ్రీకన్య, కొత్తపల్లిలో దివ్య, విలాసాగర్‌లో అస్మా, కాటారంలో రాజన్న, ఒడిపిలవంచలో దీపక్ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటలు, సాగు యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Post A Comment: