హైదరాబాద్, బంజారాహిల్స్ : సింగరేణి బొగ్గు కాంట్రాక్టుల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విస్తృత ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఒకేసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్మికుల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే అన్ని పార్టీలూ పెద్దపీట వేస్తున్నాయని, కోట్ల రూపాయల కాంట్రాక్టుల వెనుక భారీ రాజకీయ కుట్రలు నడుస్తున్నాయని ఆమె ఆరోపించారు.
“చిన్న చేప – పెద్ద తిమింగలం” సిద్ధాంతం
సింగరేణి నైనీ బ్లాక్ కాంట్రాక్టుల విషయంలో రూ.250 కోట్ల విలువైన కాంట్రాక్టు పొందిన సృజన్‌రెడ్డిని పెద్ద నిందితుడిలా చిత్రీకరిస్తూ, రూ.25 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న మేఘా కృష్ణారెడ్డి అనే “పెద్ద తిమింగలం”ను కాపాడుతున్నారని కవిత ఆరోపించారు.“చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పి, పెద్ద చేపను రక్షించే ప్రయత్నం జరుగుతోంది. గుంటనక్క, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కేటీఆర్ కలిసి ఇదే డ్రామా ఆడుతున్నారు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
గతంలో కాంట్రాక్టులు ఎవరిచ్చారు?
సృజన్‌రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పట్లో ఆయన సీఎం బావమరిది అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. “అప్పుడు రేవంత్ రెడ్డి బావమరిది అని గుర్తు రాలేదు… ఇప్పుడు మాత్రం అదే పెద్ద నేరమైపోయిందా?” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఎక్సెస్ టెండర్లపై అబద్దాలు
బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని కేటీఆర్ చెప్పడం పూర్తిగా అబద్దమని కవిత స్పష్టం చేశారు. 36, 16, 7, 8 శాతం ఎక్సెస్‌కు అనేక టెండర్లు ఇచ్చారని గణాంకాలతో గుర్తు చేశారు. “కేటీఆర్ ఏ విషయమైనా అధ్యయనం చేసి మాట్లాడతారని అనుకున్నా… కానీ ఈసారి ఆయన మాటలు వింటే బాధేసింది” అని వ్యాఖ్యానించారు.
ఎండీవో విధానంతో సింగరేణికి నష్టం
సింగరేణిలో అమలవుతున్న ఎండీవో విధానం సంస్థకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోందని కవిత ఆరోపించారు. గతంలో ఓపెన్‌కాస్ట్ గనులతో లాభాల్లో ఉన్న సింగరేణి, ఈ విధానం వల్ల అప్పులపాలైందని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలోనే రూ.25 వేల కోట్ల అప్పు పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది రూ.50 వేల కోట్లకు పెరిగిందని అన్నారు. పవర్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో జీతాలకే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులపై నిర్లక్ష్యం
కార్మికుల సమస్యలపై రెండేళ్లుగా ఎవరూ మాట్లాడలేదని, వంద అన్యాయాలు జరిగినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మౌనం పాటించాయని విమర్శించారు. కానీ “ఒక పెద్ద కాంట్రాక్టర్‌కు ఇబ్బంది వస్తే మాత్రం అందరూ ముందుకు వస్తున్నారు” అని మండిపడ్డారు. నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేసినట్లే ఎండీవో విధానాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌ను ఓపెన్‌కాస్ట్‌గా అభివృద్ధి చేస్తే తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు వస్తాయని సూచించారు.
మీడియా, జర్నలిస్టుల అరెస్టులపై విమర్శలు
దళిత మహిళలపై కథనాలు వచ్చినప్పుడు జర్నలిస్టులపై అరెస్టులు చేయడం తీవ్రంగా తప్పుబట్టారు. “వాళ్లు టెర్రరిస్టులు కాదు… నోటీసులు ఇచ్చి వివరణ అడగాలి” అని సూచించారు.
“కేటీఆర్‌పై కథనం వస్తే ఒక నీతి… దళిత మహిళపై కథనం వస్తే మరో నీతా?” అంటూ ప్రశ్నించారు. మహిళల విషయంలో ఇదేనా బీఆర్ఎస్ వైఖరి అని నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణపై అనుమానాలు
ఫోన్ ట్యాపింగ్ విచారణను ప్రభుత్వం జోక్‌గా మార్చిందని, బాధితులకు న్యాయం జరగడం లేదని కవిత ఆరోపించారు. “టెర్రరిస్టుల కోసం ఉండాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు” అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా చేస్తున్నారని విమర్శించారు.
రాజకీయ ప్రకటనలు – జాగృతి దూకుడు
“కాంగ్రెస్ తెలంగాణలో లూజర్ పార్టీ… వచ్చే ఎన్నికల్లో గెలిచేది జాగృతి పార్టీయే” అని కవిత ధీమా వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్‌ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, ఆయన వస్తే నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తామని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని బద్నాం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము సీరియస్ రాజకీయ పార్టీగా ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కాంట్రాక్టుల వ్యవహారంలో అన్ని ప్రధాన పార్టీలూ కాంట్రాక్టర్ల పక్షానే నిలుస్తున్నాయని, కార్మికుల పక్షాన నిలిచింది ఒక్క జాగృతి పార్టీ మాత్రమేనని కవిత స్పష్టం చేశారు.
“బీఆర్ఎస్ అబద్దాలు మానేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. పెద్ద చేపలను కాపాడే రాజకీయాలు ఆపాలి” అంటూ ఆమె ఘాటు హెచ్చరికతో ప్రెస్‌మీట్ ముగిసింది.

Post A Comment: