రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) తరఫున పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు భూపాలపల్లి జిల్లా టిఆర్పి అధ్యక్షుడు రవి పటేల్ ప్రకటించారు. భూపాలపల్లి పట్టణంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, గత పాలకులైన టిఆర్ఎస్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రజలను మభ్యపెట్టే దొంగ హామీలతో రెండు పార్టీలు ముందుకు వస్తున్నాయని విమర్శించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు టిఆర్పి పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీకి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందన్నారు. సామాన్యుడు కూడా కౌన్సిలర్‌గా పోటీ చేయగలిగే విధంగా టిఆర్పి పార్టీ అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇకపై ఆశావాహులు కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల హక్కుల కోసం ఏర్పడిన టిఆర్పి పార్టీ అందరినీ ఆహ్వానిస్తోందని స్పష్టం చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టో రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భూపాలపల్లి మున్సిపాలిటీ దయనీయ స్థితిలో ఉందని, మళ్లీ పాత పాలకుల చేతికి అధికారాన్ని అప్పగిస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని హెచ్చరించారు. విజ్ఞులైన ప్రజలు టిఆర్పి పార్టీని ఆదరించాలని, ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు నేరుగా తనను సంప్రదించాలని రవి పటేల్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా నాయకులు రోడ్డ శ్రీనివాస్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు మామిండ్ల మధుకర్ గౌడ్, జిల్లా నాయకుడు మామిడి శ్రీకాంత్, మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: