భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తారంటూ కొందరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్రంగా మండిపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి జిల్లాను భూకంపం వస్తే తప్ప ఎవరూ రద్దు చేయలేరని స్పష్టం చేశారు. జిల్లా రద్దు అంశం పూర్తిగా అవాస్తవమని, ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భూపాలపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొందరు రాజకీయ స్వార్థంతో ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఆయన ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం మీద అబద్ధాలు చెప్పి ఓట్లు గెలవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, రహదారులు, వైద్య సదుపాయాలు, విద్యా సంస్థలు, తాగునీటి సరఫరా వంటి అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతోందని చెప్పారు. ఇలాంటి సమయంలో జిల్లా రద్దు చేస్తారనే ప్రచారం చేయడం పూర్తిగా హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజల హక్కులను కాపాడేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, ప్రజలు వీటిని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా రద్దు అనే ప్రశ్నే లేదని, భూపాలపల్లి జిల్లా భవిష్యత్తు మరింత బంగారంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతో కొందరు సన్నాసులు అబద్ధాల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే నిజాయితీగా ప్రజల ముందుకు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం మానుకుని, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. దుష్ప్రచారాలకు తగిన సమాధానం ఇచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: