కాటారం, నవంబర్ 3 మేడిగడ్డ టీవీ న్యూస్ : పశువుల సంపదను కాపాడటంతో పాటు దూడల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ప్రాధాన్యతనిస్తూ కాటారం మండలంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఆరు నెలలలోపు దూడలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని గంగారం, విలాసాగర్, ధన్వాడ, చిదినేపల్లి, మర్రిపల్లి, బయ్యారం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. కాటారం మండల పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పశువైద్యాధికారి మాట్లాడుతూ.. దూడల పేగుల్లో ఉండే నట్టలు వాటికి అందాల్సిన పోషకాలను గ్రహించడం వల్ల దూడల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని తెలిపారు. నట్టల సమస్య కారణంగా దూడలు ఆశించిన స్థాయిలో బరువు పెరగకపోవడం, రక్తహీనత, నీరసం, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ఈ సమస్యలను నివారించేందుకు పశువైద్యుల సూచనల మేరకు నిర్ణీత వ్యవధుల్లో నట్టల నివారణ మందులు తాగించడం అవసరమని పేర్కొన్నారు.

దూడల వయస్సు, శరీర బరువును బట్టి పశువైద్యుల సూచించిన మోతాదులోనే మందులు ఇవ్వాలని రైతులకు సూచించారు. పశువుల పాకలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దూడలకు నాణ్యమైన పశుగ్రాసం, శుభ్రమైన తాగునీరు అందించాలని తెలిపారు. దూడల్లో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప పశువైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పశువైద్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దూడల చిన్న వయస్సు నుంచే తగిన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వాటి ఎదుగుదలకు, భవిష్యత్తులో మెరుగైన పాల ఉత్పత్తి, పశుసంపద అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజేందర్ (ఎల్‌ఎస్‌ఏ), పశువైద్య సహాయకులు రాజశేఖర్, కిషన్, ఓఎస్ సుల్తానా బేగం, పశుమిత్ర నజీమా, గోపాలమిత్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: