భూపాలపల్లి జిల్లా, నవంబర్ 2 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆశతో ప్రజావాణికి వస్తారని, వారి వినతుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజల నుంచి మొత్తం 78 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, వాటిపై తీసుకున్న చర్యలు, పరిష్కార వివరాలను ఎప్పటికప్పుడు ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వారంలోగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: