జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డిపై మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కుట్ర ఆరోపణలు చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు నకిలీ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన కుట్ర చేశారంటూ ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అని రమేష్ విమర్శించారు. ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడంతో పాటు ప్రజల్లో విద్వేషాలు, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నమని ఆరోపించారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వీడియోలు, సందేశాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగించి, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోల సృష్టి వెనుక బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకుల ప్రమేయం ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తూ, అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని కోరారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని 196, 61, 353(1)(సి), 353(2), 318(4) సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని 66D సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు రమేష్ తెలిపారు. ఈ వీడియోను, సందేశాలను వివిధ సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో వైరల్ చేసిన మానం రాజబాబు, ఇతరులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు వెల్లడించారు.
ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వీడియోలు, సందేశాలను నిర్ధారణ లేకుండా నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపించే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని కుంభం రమేష్ విజ్ఞప్తి చేశారు.

Post A Comment: