భూపాలపల్లి జిల్లా, అక్టోబర్ 30 మేడిగడ్డ టీవీ న్యూస్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం రేగొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి వేదాశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహూకరించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌ను మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: