సుందిళ్ల, అక్టోబర్ 18 (మేడిగడ్డ టీవీ న్యూస్): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని నరసింహులపల్లి శ్రీ దుర్గాభవాని మాత ఆలయ సమీపంలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి, ఆటపాటలతో సందడి చేస్తూ పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న బతుకమ్మ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో గ్రామస్థులు ఈ వేడుకలను నిర్వహించారు. గంగపుత్ర కమిటీ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలకు గ్రామశాఖ అధ్యక్షుడు బోగిరి భాస్కర్ అధ్యక్షత వహించారు. తమ తండ్రులు, తాతల కాలం నుంచి కొనసాగుతున్న బతుకమ్మ ఆటపాటల సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోగిరి నరసయ్య, బోగిరి రాములు, మాటూరి నర్సయ్య, మాటూరి సమ్మయ్య, కమిటీ సలహాదారులు జునుగరి రాజేశం, బోగిరి తిరుపతి, బోగిరి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు, గ్రామస్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా ముగిశాయి.

Post A Comment: