ఆజాంనగర్ / దూదేకులపల్లి / పెగడపల్లి: అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ పోడు సాగుపై వస్తున్న ఆరోపణలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజా కుల సంఘాల జేఏసీ చైర్మన్ పీక కిరణ్ మౌర్య డిమాండ్ చేశారు. అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులు అక్రమాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అజాంనగర్, దూదేకులపల్లి, పెగడపల్లి అటవీ ప్రాంతాల్లో అక్రమ పోడు సాగు, అటవీ భూముల ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చుతున్నట్లు వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకర చర్యల వల్ల వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూములను అక్రమంగా దున్నుతున్నట్లు విచారణలో తేలిన ప్రాంతాల్లో బ్లేడ్ ట్రాక్టర్లను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యుత్ తీగల కారణంగా ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని కోరారు. అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు ఉన్నట్లయితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అటవీ భూములు ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, అవి ప్రజల సహజ సంపద అని పీక కిరణ్ మౌర్య పేర్కొన్నారు. అటవీ సంపదను పరిరక్షించడం అధికారుల బాధ్యత అని, ఆ బాధ్యత నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మిర పూల్ సింగ్ నాయక్, కో-కన్వీనర్ రామగిరి రాజు, మహాముత్తారం మండల జేఏసీ కన్వీనర్ లింగమళ్ల సడవలిరావు, మండల చైర్మన్ ముక్కెర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: