భూపాలపల్లి, అక్టోబర్ 9:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువత చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత వేతనాలతో కూడిన ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో టాస్క్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, ఉద్యోగ నియామక ప్రక్రియను సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 142కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొని యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనంతో ఉద్యోగంలో చేరినా, అనుభవం, నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు సాగితే రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం పొందే అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయం, కూలీ పనులు, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తున్నారని, వారి కష్టాన్ని గుర్తించి యువత అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించేందుకు ప్రభుత్వం స్కిల్‌ యూనివర్సిటీతో పాటు టాస్క్‌ ద్వారా పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి తెలిపారు. విద్యార్హతలతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు ఉన్నప్పుడే మెరుగైన ఉద్యోగాలు, పదోన్నతులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కంపెనీల అవసరాలకు తగిన శిక్షణ అందిస్తూ ప్రైవేటు సంస్థలతో సమన్వయం చేసుకొని మరింత మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు తెలిపారు. గ్రూప్‌-1, 2, 3, 4 పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తూ అర్హులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ తదితర విద్యార్హతలు కలిగిన యువత ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు సాధించేందుకు ఇలాంటి జాబ్‌మేళాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

రెండు గంటల్లోనే 600 మందికి పైగా ప్రాథమిక ఎంపిక.

జాబ్‌మేళా ప్రారంభమైన రెండు గంటల్లోనే 600 మందికి పైగా యువత ప్రాథమికంగా ఎంపికైనట్లు మంత్రి వెల్లడించారు. కొన్ని కంపెనీలు ఒక్కొక్కటి 100 నుంచి 400 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఉద్యోగాల కోసం యువత ప్రాంతీయ పరిమితులు విధించుకోకుండా, ఎక్కడ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలని సూచించారు. నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కష్టపడి పనిచేస్తే మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని భరోసా ఇచ్చారు.

భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి, పట్టణంలో రోడ్ల విస్తరణతో పాటు రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


యువతకు గొప్ప అవకాశం: ఎమ్మెల్యే గండ్ర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. భూపాలపల్లి నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌మేళా గొప్ప అవకాశమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 10 వేల నుంచి 12 వేల వరకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. టాస్క్‌ ఆధ్వర్యంలో జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.

సింగరేణి సంస్థ సహకారంతో శిక్షణ కేంద్రానికి విశాలమైన హాలు, ఏసీ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గాంధీనగర్‌ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. గత సంవత్సరం నిర్వహించిన మెగా జాబ్‌మేళా ద్వారా 2,700 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు గుర్తుచేశారు.


అర్హతకు తగిన ఉద్యోగాలు సాధించాలి: కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. మెగా జాబ్‌మేళాలో 142కు పైగా కంపెనీలు పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. కంపెనీలు స్థానికంగానే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. జాబ్‌మేళా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంకీర్త్‌, టాస్క్‌ సీఈఓ ప్రదీప్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ దండు రమేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బుర్ర కొమరయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: