భూపాలపల్లి, అక్టోబర్ 12 మేడిగడ్డ టీవీ న్యూస్ : భూపాలపల్లిలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనను తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు తీవ్రంగా ఖండించారు. కార్మిక సంఘాల కార్యాలయాలపై కక్షపూరిత చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సంఘాల కార్యాలయాలను కూల్చివేయడం ద్వారా వారి గొంతును నొక్కాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్మిక సంఘాలకు తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించుకునే హక్కు ఉందని, ఆ హక్కులకు భంగం కలిగించే చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా నిలుస్తాయని పేర్కొన్నారు.


ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ బాధ్యత స్పష్టం చేయాలి

సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ కొమురయ్య గౌడ్ తమ బాధ్యతను స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించకూడదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన వారు, వారి సంఘాల కార్యాలయాల విషయంలో వివాదాలకు తావివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యాలయాన్ని కూల్చివేసే క్రమంలో చట్టబద్ధమైన అనుమతులు, విధివిధానాలు పాటించారా లేదా అన్నది విచారణలో తేల్చాలని కోరారు. రాజకీయ కక్షతో లేదా ఇతర కారణాలతో చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కార్మికుల హక్కులను కాపాడాలి.

సింగరేణి కార్మికులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి హక్కులను కాపాడటం ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల బాధ్యత అని గడ్డం లక్ష్మణ్, నక్క నారాయణరావు గుర్తుచేశారు. కార్మిక సంఘాల స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను పౌర హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయానికి సంబంధించిన ప్రహరీ గోడ కూల్చివేతపై సమగ్ర విచారణ జరిపించాలని, నష్టానికి సంబంధించిన వివరాలను పరిశీలించి బాధిత సంఘానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కార్మిక సంఘాల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మిక సంఘాల గొంతును నొక్కాలని చూస్తే ప్రజాస్వామ్య శక్తులు చూస్తూ ఊరుకోవని, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని వారు స్పష్టం చేశారు.

వివిధ ప్రజాసంఘాల నాయకుల పాల్గొనడం.

ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాని, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రాదండి దేవేందర్, టీఎస్‌యూఎస్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరేటి రాజన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఐత బాబు, పార్వతక్క, టీఎస్‌యూఎస్ కార్మిక సంఘం నాయకులు దాసరి జనార్ధన్, జైపాల్ సింగ్, గోడిసెల శ్రీహరి, నామల శ్రీనివాస్‌తో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: